ఆది శంకర జయంతి

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత,స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని  భక్తుల ప్రగాఢ విశ్వాసం

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!

శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).

జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ( క్రీస్తు పూర్వం అని రాసుకోడానికి చింతిస్తున్నాను, శంకరుల శకం శంకరుల పూర్వం అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుండు )

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం l గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.

ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది.

ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. “ కనకధారా స్తవం ” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి

అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు.

ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.  ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు.సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, “ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను” అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.

ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.

ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ,ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట  కోసం తల్లి అవసాన దశలో ” శ్రీకృష్ణభగవానుని ” లీలలను చూపించి సంతోష పరచాడు !!
ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!

ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.

మాతృ దినోత్సవం, అంతర్జాతీయ మాతృ దినోత్సవం (Mothers Day) ఎలా ప్రారంభం అయింది
స్కంద షష్టి వ్రతం

Related Posts

No results found.

Comments