యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను మాయ కు సంకేతంగా, తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకగా చెబుతారు. భగవద్గీతలో అష్టవిధ మాయలను గూర్చి ప్రస్తావన ఉంటుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలను పంచేంద్రియాలు గా పరిగణిస్తే.. [కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం]+ మనసు + బుద్ధి + అహంకారం ఎనిమిదిని జయించిన వారికి కలిగే వాటినే అష్ట సిద్ధులు అంటారు.
దత్తచరితంలో శ్రీ దత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా ప్రస్తావించారు. తమ భక్తులైన వారికి అష్ట సిద్ధుల అనుగ్రహం ఉంటుందని అభయమిచ్చారు.
ఒక విధంగా భగవానుని దివ్య ఆరాధనకు ఫలముగా భక్తులకు ప్రాప్తించే ఎనిమిది సిద్దులే అష్ట సిద్దులు.పూర్వము ఋషులు, యోగులు, మహర్షులు అష్టసిద్దులను పొందారని మన పురాణాలు చెపుతున్నయి. ఆంజనేయస్వామి అష్టసిద్ధులు పొందారుకనుకనే తులసీదాసు చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని స్తుతించారు.
అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదినీ అష్టసిద్ధులు అని అంటారు.
అష్టసిద్దుల వివరణ:
1. అణిమ : సుక్ష్మావస్థ లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుటవల్ల ఈ సిద్ధి వస్తుంది. దీని వల్ల అత్యంత సుక్ష్మఅణువుగా యోగి తనను తానూ మార్చుకొనగలడు.
2. మహిమ : భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సామానమయిన కీర్తిని పొందగలుగుతాడు
3. గరిమ : ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు.
4. లఘిమ : ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు
5. ప్రాప్తి : ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్నా క్షణములలో శూన్యం నుండి కూడా సృజించుకోగలరు
6. ప్రాకామ్యము : అనేక దివ్య శక్తులు (దూర దర్శనము, దూర శ్రవణము , ఆకాశ గమనము) వారి వశములో ఉంటాయి.
7. ఈశత్వం : ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది
8. వశిత్వం : సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి
గమనిక: అష్టసిద్దులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేదించబడినది.
సేకరణ: https://www.panditforpooja.com/blog/significance-of-ashta-siddhis/