భీష్మ ఏకాదశి – భీష్మ చరితం | భీష్ముని ధర్మనిరతి

భీష్మ ఏకాదశి – భీష్మ చరితం | భీష్ముని ధర్మనిరతి

భీష్మ ఏకాదశి:

తండ్రిని సత్యవాక్కున ప్రతిష్టితుడిని చేసి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతేతండ్రి సుఖసంతోషాలను కోరి, సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.

అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా… ఆ మిట్టమధ్యాహ్నం వేళ (అభిజిత్‌లగ్నంలో) శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే… భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.

భీష్మ చరితం:

మహాభారంతంలోని ఆదిపర్వం ప్రకారం… పూర్వజన్మలో భీష్ముడు మునిశాపం పొందిన అష్టవసువులలో ఒకడు. మానవజన్మ ఎత్తేందుకు భూలోకానికి బయలుదేరినవారికి గంగాదేవి ఎదురొచ్చిందట. ఆ తల్లి కడుపున పుడితే మంచిదని భావించిన వసువులు గంగమ్మతో విషయం చెప్పి, తాము పుట్టగానే తనలో కలుపుకుని మోక్షం ప్రసాదించమని కోరతారట. అందుకు అంగీకరించిన గంగమ్మ ఒక్క బిడ్డ మాత్రం దీర్ఘాయుష్షుతో పుట్టాలని కోరింది. సరేనన్న మొదటి ఏడుగురు వసువులు తమ ఆయుష్షులో కొంత భాగం ఆఖరి వసువుకు ధారపోశారు. మానవరూపంలో భువికి దిగివచ్చిన గంగాదేవిని చూసి మోహిస్తాడు శంతనుడు. ఆమెను వివాహం చేసుకుంటానంటాడు. అప్పుడు గంగ ‘నేనేం చేసినా అడ్డుచెప్పకూడదు. అలా చెప్పిన మరుక్షణం నిన్ను వీడి వెళ్ళిపోతాను‘ అనే షరతుతో శంతనుణ్ణి పెళ్ళిచేసుకుంటుంది. ఆ తర్వాత గంగాదేవి తమకు పుట్టిన ప్రతిబిడ్డనూ నీటిపాలు చేయడం మొదలుపెడుతుంది. ఏడుసార్లు సహించిన శంతనుడు ఎనిమిదోసారి ఆమెను వారిస్తాడు. తనను అడ్డగించిన శంతనుడితో కాపురం చేయనంటుంది గంగ. ఆ బిడ్డను పెంచి సకల విద్యలూ నేర్పించి భర్తకు అప్పగిస్తానని చెప్పి తనతో తీసుకెళ్తాడు. అతడే భీష్ముడు.

భీష్ముని ధర్మనిరతి:

మహాభారతంలో భీష్ముడిది కీలకమైనపాత్ర. ఏ రాచబిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది. కానీ చిరువయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు. దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహం జరిపిస్తాడు. ‘భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు‘ అని దాశరాజు సందేహిస్తుంటే… తానసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆమెకు పుట్టిన బిడ్డల్లో చిత్రాంగదుడు గంధర్వులతో పోరులో మరణిస్తాడు. రెండోకొడుకు విచిత్రవీర్యుడు క్షయరోగి. అతడికి పిల్లనిచ్చేవారెవరూ దొరకరు. అప్పుడూ భీష్ముడే పూనుకుంటాడు. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకూ స్వయంవరం ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి ఆ కన్నెలను బలవంతంగా తీసుకోచ్చేస్తాడు. ముగ్గురిలో పెద్దదైన అంబ అప్పటికే మరొక వీరుణ్ని ప్రేమించిందని తెలుసుకుని ఆమెను మాత్రం విడిచిపెడతాడు. మిగతా ఇద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేస్తాడు. దురదృష్టవశాత్తూ విచిత్రవీర్యుడు కన్నుమూస్తాడు.

అంబికకూ, అంబాలికకూ పుత్రయోగం కలిగించి వంశాన్ని కాపాడమని భీష్ముణ్ని అడుగుతుంది సత్యవతి. సింహాసనంతోపాటు ఇద్దరు భార్యల్ని పొందే అవకాశాన్నీ కాదనుకుని తన ప్రతిజ్ఞకే కట్టుబడతాడు గాంగేయుడు. సద్యోగర్భం ద్వారా సత్యవతి కన్న వ్యాసుణ్ణి హస్తినకు రప్పిస్తాడు. వ్యాసుడిద్వారా అంబిక అంబాలికలకు గుడ్డివాడైన దృతరాష్టుడు, పాండురోగంతో పాండురాజు పుడతాడు. వారి వివాహాల విషయంలోనూ కీలకపాత్ర భీష్ముడిదే. గాంధార దేశాధిపతి సుబలుణ్ణి భయపెట్టి అతనికుమార్తె గాంధారిని తీసుకొచ్చి దృతరాష్టుడికిచ్చి పెళ్ళిచేస్తాడు.

ద్రౌపదికి నిండుసభలో అవమానం జరుగుతుంటే ఉపేక్షించడంలోనూ భీష్ముడు ధర్మాణ్ని పాటించడమే కనిపిస్తుంది. అంత్యకాలంలో యుధిష్టిరుడికి ధర్మబోధ చేస్తున్నప్పుడు ద్రౌపది… ‘నాడు నిండుసభలో నన్ను అవమానిస్తున్నప్పుడు ఏమైనాయి ఈ ధర్మపన్నాలు‘ అని అడుగుతుంది. ‘ఆనాడు నేను రాజధర్మానికి కట్టుబడ్డాను. వారికి నేను సంరక్షుకుడిని, సేవకుడిని‘ అని సమాధానమిస్తాడు భీష్ముడు. తాను కోరుకున్నప్పుడు చనిపోగల వరం ఉండికూడా చాలారోజులపాటు అంపశయ్యపై శరీరాన్ని శుషింపజేసుకోవడమే ఆ పాపానికి ప్రాయశ్చిత్తమనీ భావించాడు కాబట్టే ఆ శిక్ష వేసుకుంటాడు భీష్ముడు. ఎన్నికష్టాలెదురైనా చలించక తుదికంటా ధర్మానికి మాత్రమే కట్టుబడిన ఆదర్శప్రాయుడు కనుకనే కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజును భీష్ముడి దగ్గరకు తీసుకెళ్ళి ధర్మబోధ చేయిస్తాడు శ్రీ కృష్ణుడు. అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని ప్రసిద్ధి. అలాంటిది ఆ వాసుదేవుణ్ణే ఎదురుగా పెట్టుకుని వేయినామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు. అవే అనంతరకాలంలో విష్ణుసహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కడంవిశేషం. అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమినాడు, తర్వాత వచ్చే ఏకాదశినాడు విష్ణుసహస్రనామం పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు భక్తులు.

సేకరణ: https://www.panditforpooja.com/blog/significance-of-bhishma-ekadasi/

bhishma, bhishma ashtami, bhishma ekadasi, bhishma pitamaha, bhishmacharya, vishnu sahasranamam, భీష్మ, భీష్మ ఏకాదశి, భీష్మాచార్యుడు, భీష్ముడు
భీష్మ ఏకాదశి – భీష్మ తర్పణ విధానం
భీష్మాష్టమి – భీష్మ తర్పణ విధానం

Related Posts