సింహాచల చందనోత్సవం

సింహాచల చందనోత్సవం

Loading

సింహాచల చందనోత్సవం

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీ వరాహ నారసింహ స్వామి “ప్రహ్లాద వరదుడు కేవలం ప్రహ్లాదునీ రక్షించిప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం” అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహనృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి వున్నాడు శ్రీ లక్ష్మి వరాహ నారసింహుడు. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయగా చెప్పబడి స్వామికి సంవత్సర కాలంగా వున్న చందనపు పూతనంతటిని జాగ్రత్తగా వేరుచేసి, యధావిదిగా అర్చనాదులన్నింటిని జరుపి కొన్ని గంటలు మాత్రమే నిజ రూప దర్శనం భక్తులకు కల్పించడం ఆనాటి ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచో చందనం మొక్కుకొని కోర్కెలు తీర్చుకున్న భక్తులు రావడం, చందనం సమర్పించడం, స్వామి శరీరం నుండీ తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనాటి ప్రత్యేకత.

శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం
వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం ||

అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము. ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలములిస్తాయి. ఈ అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలదము.

సింహాచలము … ప్రహ్లాదుడు

కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. మహా శివ భక్తుడైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. రాక్షస రాజులలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు మదబల గర్వితులై ముల్లోకాలను గడ గడ లాడించిన పరమ క్రూరులు. హిరణ్యాక్షుడు ఒకానొక సమయమున భూదేవిని చెరబట్టి చాప చుట్టునట్లు చుట్టి తీసుకవెల్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహావతారమెత్తి శిక్షించాడు. తమ్ముడైన హిరణ్యాక్షుడిని చంపిన శ్రీహరిపై తీవ్ర కక్షవహించి తనను మించిన అజేయుడు ముల్లోకముల్లోను ఉండరాదు, తనకు చావు రాకూడదు, తానూ వృద్ధుడు కారాదు అనే కోరికల సాధనకు హిరణ్యకశిపుడు మంద పర్వతమునకు వెళ్లి అచ్చట ఒంటికాలి బొటన వ్రేలిపై నిలబడి బ్రహ్మను గురించి తీవ్ర తపమాచరించాడు. అతని ఘోరతపస్సుకు ముల్లోకాలు దద్దరిల్లిపోయినాయి. సెగలు పోగలుగా లోకాలన్నిట వ్యాపించి జీవులను వణికించింది దేవతలు ఆలోచించారు. బ్రహ్మ హిరణ్యకశిపుని వద్దకు వచ్చారు.నాయనా హిరణ్యకశిపా లే, నీకే వరం కావాలో కోరుకో… నీ శరీరమంతా పురుగులు తిని వేస్తున్నాయి, ఎందుకింత కటిన తపస్సు అంటూ లేపాడు. లేచిన హిరణ్యకశిపుడు దేవదేవా, జగత్పితా, వచ్చావా, రా, నాకేం కావాలో అడుగుతాను విను నీవు సృష్టించి జీవరాసులలో దేని వలన నాకు చావు రాకూడదు. రాత్రిగానీ, పగలు కానీ, భూమిపైన గానీ, ఆకాశమునగాని, బైటకానీ, ప్రాణమున్న ఆయుధముతోకానీ, ప్రాణములేని ఆయుధముతోకాని నాకు చావురాకూడదు. సకల సంపదలూ, సకల గ్రహరాశులు నా ఆధీనములో వుండాలి. నాకెదురు వుండకూడదు. ఇవీ నా కోరికలు అన్నాడు. అది విన్నాడు బ్రహ్మ. సరే ఇచ్చాను పో అన్నాడు. విజయగర్వంతో వెళ్ళాడు రాక్షస రాజు .

ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలము హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహ్లాదుని కోరికమేరకు పిన తండ్రిని చంపిన వరహామూర్తి, తండ్రిని చంపిన నరసింహ అవతారం హిరణ్యకశిపుని వధించాక లక్ష్మీదేవితో కలిసి నేను ప్రహ్లాదునితో పూజలందుకుంటూ సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటాను అన్నాడు స్వామి.

నిజ రూప దర్శనం

స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, నెలలో దాగివున్నపాదాలు, ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తీసివేయగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్ళీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, చందన లేపనం తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. ప్రసాదంగా స్వామీ నుంచీ తీసిన గంధం, అనగా చందనం ప్రసాదం ముఖాన పెట్టుకొని కొంత నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గుతాయని నమ్మకం.

అపురూపం అప్పన్న నిజరూపం..!

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి దేవుడి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించి ఆ రూపాన్ని మదిలో నిలుపుకుని వెనుదిరుగుతారు భక్తులు. ప్రత్యేక సందర్భాల్లో ఆ మూర్తి అలంకరణలో భిన్నత్వం మినహా మిగతా సమయాల్లో దేవతా విగ్రహరూపం ఒకేలా ఉంటుంది. కానీ సింహాచలం కొండల్లో వెలసిన వరాహ నరసింహ మూర్తిని దర్శించుకోవాలంటే ఏడాది మొత్తంలో ఒకే ఒక్క రోజు వీలవుతుంది. మిగతా రోజుల్లో చందనలేపనంలో మునిగిపోయే అప్పన్న ఈ ఏడాది ఏప్రిల్‌ 18న నిజరూప దర్శనం ఇవ్వనున్నాడు. ఎటుచూసినా శ్రీచందన పరిమళాలూ సంపెంగల సౌరభాల్లాంటి ఎన్నో ప్రకృతి రమణీయతలతో విరాజిల్లే క్షేత్రం సింహాచలం. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే.

చందనోత్సవం…

విష్ణుమూర్తి అవతారాల్లోని ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేనివిధంగా సింహాచలంలో కొలువుదీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రహ్లాదుడి కోరిక మేరకు… హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రెండూ ఉగ్రరూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికే ఆయన్ను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహ స్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయనాడే. అందుకే ఆనాటి నుంచీ ప్రతి అక్షయ తృతీయ నాడూ స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థలపురాణం తెలియజేస్తోంది. యాత్ర ఇలా…
నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచీ ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలుపెడతారు. దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదికవుతుంది. రంగరించిన చందనానికి అరవై రకాల వనమూలికలూ సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందన లేపనాన్ని తయారుచేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలితో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు. అనంతరం వేదమంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం మళ్లీ చందన పూత పూస్తారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది.

నాలుగు విడతలుగా……

వరాహలక్ష్మీనరసింహ స్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం చందన రూపుడై సాక్షాత్కరించే స్వామికి నాలుగు విడతలుగా చందనాన్ని పూస్తారు. దీన్ని తమిళనాడు, కేరళల నుంచి కొనుగోలు చేస్తారు. మొదట అక్షయ తృతీయనాడు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు విడతలుగా తొమ్మిది మణుగుల చందనాన్ని పూస్తారు. మొత్తంగా స్వామికి సుమారు అయిదు వందల కిలోల చందనాన్ని సమర్పిస్తారన్నమాట. చందన ప్రసాదం …..
చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.

ఇలా చేరుకోవచ్చు….

విశాఖపట్నంలో కొలువైన సింహాద్రి అప్పన్న క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నగరానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, గాజువాక, ఎన్‌ఏడీ ప్రాంతాల నుంచి ప్రతి పది నిమిషాలకూ ఓ బస్సు ఉంటుంది.

maha vishnu, narasimha
బుధగ్రహ దోష నివారణకు ప్రత్యేక ఉపాయాలు
అశ్వత్థ వృక్షం ను ఎలా పూజించాలి?

Related Posts