సోమవతి అమావాస్య

Loading

importance of somvati amavasya

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

సోమవతి అమావాస్య వ్రతం (Somavati Amavasya Vratram)

శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం.

సోమావతీ అమావాస్య రోజున పేదపిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.
ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
శని మంత్రాన్ని పఠించి, శ్రీ మన్నారాయణ మూర్తిని అర్చించాలి.
గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.
వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం – సోమావతీ అమావాస్య నాడు పేదపిల్లలకు అన్నదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది.
దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ. ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.

శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి… తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.

సోమావతి అమావాస్య కథ :

పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు, యుక్తవయస్కురాలైన కూతురుతో నివసిస్తుండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహము చేయ లేక పోయారు. ఒకరోజు ఒక మునిపుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి, భోజనానంతరం తమ కుమార్తె విషయము తెలిపి ఆశీర్వదించ మనగా ఆ ముని ఈ యువతికి వివాహం యోగము లేదని చెప్పెను.అంతట వారు బాధాతప్త హృదయముతో నివారణా పరిహారము కోరగా ఆ ముని ఇచట కు దగ్గరలో “సోమ” అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపెను. అంతట ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి గృహమునందు ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమవతి ఎందుకు మా ఇంట్లో పని చేయుచున్నావని యడుగగా, ఆమె ఆ ముని ఉదంతం అంతయు తెలిపెను.

అప్పుడు సోమావతి ఆ యువతికి సహాయము చేయనెంచి, తన పాపిట నుండి సగం కుంకుమను తీసి ఇవ్వగా, ఆమె దానిని ధరించెను. కొన్ని దినములకు వివాహ ఘడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందెను. ఆమెకు వివాహమైంది. కానీ సోమావతికి కుంకుమ తరుగు ఏర్పడగానే, ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు. అంతట సోమావతి కఠోర నిష్టతో పరమ శివుని ధ్యానించి, రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి, పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి, మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయము తొలిగి, పునర్జీవితుడయ్యాడు. నాటినుండి సోమవతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యము లభించినది. అందుచేత సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైనా శివాలయంలో వెలిగించాలని పెద్దలంటారు.

ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి. ఇలా మాత్రమే చెప్పబడి ఉంది. లేనిపోని ప్రచారాలు చేయకండి, నమ్మకండి.

 

amavasya, deepavali, diwali, festivals, god, hindu tradition, Karthika Masam, Pooja Vidhanalu, shiva lingam
మాసశివరాత్రి
ఆకాశ దీపం అంటే ఏమిటి?

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.