సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. భారతదేశంలోని తెలంగాణలోని ములుగు జిల్లాలోని దట్టమైన అడవుల మధ్యలో ఉన్న తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో నిర్వహించబడుతుంది, ఇది స్థానిక గిరిజన సమాజానికి రక్షకులుగా భావించే సమ్మక్క మరియు సారలమ్మ దేవతల గౌరవార్థం జరుపుకుంటారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండుగకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.
సమ్మక్క సారలమ్మ కథ
పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.ఇతను తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు.
కాకతీయ వంశానికి చెందిన రాజు కోయ తెగపై పన్నులు విధించినప్పుడు, భూస్వామ్య గిరిజన అధిపతి పగిడిద్ద రాజు వాటిని చెల్లించలేకపోయాడు. ఫలితంగా, మాఘ శుద్ధ పౌర్ణమి రోజున రాజు కోయ తెగపై యుద్ధం ప్రకటించాడు. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న వేరువేరు ప్రాంతాల నుంచి కాకతీయ సైన్యాలపై సాంప్రదాయ ఆయుధాలతో పోరాడారు. ఆ యుద్ధంలో పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ మరణించారు. పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అది జంపన్న వాగు అయ్యింది. సమ్మక్క కాకతీయ సైన్యంతో ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయేలా విరోచితంగా పోరాడింది. యుద్ధానంతరం చిలుకలగట్టు వైపు వెళ్తూ అంతర్థానమైంది. ఆమె జాడ కోసం వెతకగా.. ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. దానినే సమ్మక్కగా భావించారు. అప్పటి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క జాతరను నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది.