అయోధ్య రామ మందిరం – తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలి

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

అయోధ్య ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. సరయూ నది తూర్పు ఒడ్డున ఉన్న అయోధ్య నగరం రాజధాని లక్నో నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామ మందిరంతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో హనుమాన్ గర్హి, రామ్‌కోట్, నాగేశ్వరనాథ్ ఆలయం, కనక్ భవన్, తులసి స్మారక్ భవన్, త్రేతా కే ఠాకూర్, జైన్ టెంపుల్, మణి పర్వతం, ఛోటీ దేవ్‌కలి టెంపుల్, రామ్ కీ పైడి, సరయూ నది, క్వీన్ హో మెమోరియల్ పార్క్, గురుద్వారా, సూరజ్ కుండ్, గులాబ్, బారి బహు-బేగం సమాధి, కంపెనీ గార్డెన్, గుప్తర్ ఘాట్ ఉన్నాయి.

ఈ నెల 23 నుంచి సాధారణ ప్రజలకు అయోధ్య ఆలయంలో దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం, కొత్త బస్‌స్టేషన్లను సైతం నిర్మించి ప్రారంభించారు. రామ మందిరాన్ని సందర్శించడానికి అయోధ్యకు ఎలా చేరుకోవచ్చు తెలుసుకుందాం.

రైలు మార్గంలో అయోధ్యకు

కాచిగూడ నుంచి అయోధ్యకు ప్రతీ శుక్రవారం రైలు అందుబాటులో ఉంది. ఈ రైలు యశ్వంత్‌ పూర్‌ నుంచి బయలు దేరీ తెలుగు రాష్ట్రాల మీదుగా గోరఖ్‌పూర్‌కు చేరుకుంటుంది. రైలు నెంబర్ 15024 రైలు ప్రతీ గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరుతుంది. ధర్మవరం, అనంతపూర్, కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అనంతరం శుక్రవారం కాచిగూడలో 10.50 గంటలకు బయలుదేరీ కాజీపేట్ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌ల మీదుగా అయోధ్య ధామ్‌ జంక్షన్‌కు శనివారం సాయంత్రం 4.24 గంటలకు చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాలలో గూడూరు, విజయవాడ మరియు వరంగల్ నుండి ప్రతి సోమవారం శ్రద్ధా సేతు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ రైలు రామేశ్వరం నుంచి బయలుదేరి తెలుగు రాష్ట్రాలు మేడుగా అయోధ్య చేరుకుంటుంది. రైలు నంబర్ 22613 ప్రతి సోమవారం రామంతపురంలో బయలుదేరుతుంది. గూడూరులో సోమవారం సాయంత్రం 3:45 గంటలు, విజయవాడలో రాత్రి 8:20 గంటలకి మరియు వరంగల్‌లో రాత్రి 11:10 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 4 గంటలకు అయోధ్య చేరుకుంటుంది

రోడ్డు మార్గంలో అయోధ్యకు

అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్ రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా వెళ్లాలంటే మొత్తం 1600 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.

ఆకాశ మార్గం లో అయోధ్యకు

విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించి చేరుకోవచ్చు.