సుబ్రహ్మణ్య ఆవిర్భావం – స్కందోత్పత్తి

Loading

subramanya-avirbhavam-skandotpatti

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

subramanya-avirbhavam-skandotpatti

  1. బ్రహ్మ దేవుడు దేవతలకు ఇచ్చిన అభయమేమిటి?
  2. దేవతలు శివవీర్యాన్ని ఎందుకు పార్వతిలోకి ఎందుకు నిక్షిప్తము చేయవద్దు అని అడిగారు?
  3. పార్వతీదేవి దేవతలకి ఇచ్చిన శాపమేమిటి?
  4. శివుడు తన వీర్య తేజస్సును ఎక్కడ విడచిపెట్టాడు? ఎవరెవరు దాన్నిస్వీకరించారు?
  5. బాల మురుగన్ ఎలా జన్మించాడు?
  6. సుబ్రహ్మణ్యుడికి అనేక నామములు ఎలా వచ్చాయి?
  7. సనత్కుమారుడు పార్వతీ పరమేశ్వరులకు ఇచ్చిన వరమేమి?
  8. సుబ్రహ్మణ్య నామానికి అర్ధమేమిటి?

Parvathi Kalyanam Vibhavam

శివపార్వతుల కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోత్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సమస్త దేవతా గణములు,సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమేమనగా… పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని. శివుడు అంటే కామాన్ని గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలోతానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతున్నాడు.

Gods Praying Srimannarayana

శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భావిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి, అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మ గారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు…”బ్రహ్మాదిదేవతలారా! మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి..” అని ఓదార్చారు.

Gods with Lord Shiva

దేవతలంతా… “పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా?” అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి “దేవాదిదేవా! ప్రభూ మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధలనుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని, అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్ధిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు, పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు, దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు. దేవతల ప్రార్ధన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండీ విడివడింది కాబట్టి, నాతేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది, తను మాత్రుమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గానూ, అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై, “నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక, ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని దేవతలందరినీ శపిస్తుంది“. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం ముఫ్ఫైమూడుకోట్ల మంది అంతే.

Havya vahan with Shiva tejassu

అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.

Lord Subrahmanya Jananam

శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించుటం కోసం శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచపర్వతాన్ని భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామి వారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు

Lord Saravan.

సరే ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు… అని అడిగితే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్య ఖండంలో, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరమూ, శాపమూ అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు, నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు. అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో “నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను…” అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ”ఇదేమిటి!! శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే..” అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు..”శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ, కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి, యోనిసంభవుడిగా రానమ్మా…. నన్ను క్షమించు” అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి, ఒకనాడు నీవు మోహినీ అవతారములో ఉన్నప్పుడు, కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండీ నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు.

Siva Parvati

సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చిందీ అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామంకూడా వుంది. సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామం కూడా వుంది. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము.

సేకరణ: https://www.panditforpooja.com/blog/subramanya-avirbhavam-skandotpatti/

shasti, subrahmanya
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం
కాలభైరవ జయంతి విశిష్టత – కాలభైరవ ఆవిర్భావం | పూజా విధానం

Related Posts

Comments

1 Comment. Leave new

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.

This content is Copyrighted, and not allowed to copy!