గోదా కళ్యాణం ప్రత్యేకత | గోదా దేవి వైభవం

Loading

goda-kalyanam

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

సాధారణంగా సీతా రామ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకొంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో (గోదా కళ్యాణం) మాత్రం వైభవం అంతా అమ్మ గోదా దేవికే. ఎందుకో తెలుసా???

మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే “పాడియరుళవల్ల పల్-వళై యాయ్” అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసారు కానీ వారు తరువాతి వారికి ఏమి అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది, పద్మావతి అమ్మవారు శ్రీనివాసున్ని వివాహమాడి ఊరుకుంది, కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తనవంటి కదిలే రూపంలోనే వివాహ మాడారు వారి అవతారాల్లో. కానీ గోదా దేవి మనవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథున్ని వివాహమాడింది(గోదా కళ్యాణం).

తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని, అది దైవమని విశ్వసించి, మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. “ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర శుడరే తుయిలెరాయ్“, అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహరూపంలొ ఉండే భగవంతుడా! ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. మూడు పనులు చేసి విగ్రహరూపంలొ ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి కృష్ణమ్ ఉద్భోధ్య, కృష్ణమ్ అధ్యాపయంతి మరియూ “కృష్ణమ్ బలాత్కృత్య భూంక్తే“. ఆయన ఏమి ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా, మనల్ని బాగుచేయడానికి, మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతే కాదు స్వామి విగ్రహరూపంలో ఉన్నా ఆయన్ని నిర్బందించి, బంధించి, ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆంఢాళ్ ఉంటే, శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీదికి చిత్ర వీది అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీది ఉత్తరవీది, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాగమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవకన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవ మూర్తిగా మలచి తానూ ఉత్సవ మూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లిపుత్తూరులో, అమ్మ ఆదేశాన్ని బట్టి.

అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథున్ని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయ్యింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించినా వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం.