ఒక ఇంటికి లేదా ఒక స్థలానికి సమకోణంలో వీధి లేదా ఒక రోడ్డు దూసుకుపోతే వీధి శూల / వీధి పోటు అంటారు. అదేవిధంగా వేరొక వీధి, ఒక గృహము యొక్క గర్భంలోనికి నేరుగా ఉన్నయెడల దానిని గర్భశూల అంటారు. వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెళితే అది వీధిశూలగా గుర్తించాలి. అయితే ఈ వీధి శూల / వీధి పోటుల విషయంలో అనేక అపోహలు కలవు. సాధారణంగా ఎటువంటి వీధి శూల / వీధి పోటులు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో తెలుసుకొనుటకు కింది ఇవ్వబడిన వివరణను గమించగలరు.
- గృహము/ఇంటి యొక్క తూర్పు- ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధికి వీధిపోటు ఉన్నయెడల, ఆ ఇంటి యజమానికి సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండి, ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు.
- గృహము/ఇంటి యొక్క ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి ఉన్నయెడల, ఆ ఇంటి స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో వారి కోర్కెలు తీర్చుకుని ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధనాదాయం అధికముగానుండును.
- గృహము/ఇంటి యొక్క ఉత్తర – వాయవ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి ఉన్నయెడల, స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరలో తప్పిపోవడం, ఇంకా అనేక సమస్యలకు, చికాకులకు లోనవుతారు.
- గృహము/ఇంటి యొక్క పశ్చిమ – వాయువ్యంలో వీధి ఉన్నయెడల, మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది.
- గృహము/ఇంటి యొక్క పశ్చిమ – నైరుతి భాగంలో ఉన్న వీధి వల్ల, శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట నష్టాలు తప్పవు.
- గృహము/ఇంటి యొక్క దక్షిణ – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలెట్టినా ముందుకు సాగదు.
- గృహము/ఇంటి యొక్క దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
- గృహము/ఇంటి యొక్క తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి.
తూర్పు వీధిపోటు, ఉత్తర వీధి పోటు మిశ్రమ ఫలితములను కలుగ చేయును
ఉత్తర – వాయవ్య, పశ్చిమ – నైరుతి, దక్షిణ – నైరుతి, తూర్పు – ఆగ్నేయం చెడు ఫలితములను కలుగ చేయును .
తూర్పు- ఈశాన్య, ఉత్తర – ఈశాన్య, దక్షిణ – ఆగ్నేయ, పశ్చిమ – వాయువ్య వీధి పోట్లు మంచి ఫలితాలను కలుగచేయును.
ఈ విధంగా గృహానికి కలిగే వీధిపోట్ల వల్ల కొన్ని మంచి ఫలితాలు, మరి కొన్నిసార్లు చెడు ఫలితాలు కలిగే అవకాశమున్నది. కావునా వీధి శూల / వీధి పోటు దోష నివారణ కొరకు అశోక వృక్షము నాటుట, గణపతి స్థాపన తప్పనసరి. వాస్తుశాస్త్ర నిపుణులను సంప్రదించి తీసుకోబోయే గృహము యొక్క స్థల పరిశీలన చేయుట అత్యుత్తమము.