కోటప్ప కొండ ఆలయ చరిత్ర మరియు విశిష్టత

కోటప్ప కొండ ఆలయ చరిత్ర మరియు విశిష్టత

Loading

కోటప్ప కొండ ఆలయ చరిత్ర మరియు విశిష్టత

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు.

ఈ ఊరి అసలు పేరు కొండకావూరు, కానీ ఇప్పుడు దీనిని కోటప్పకొండ లేదా త్రికూటపర్వతం అని పిలుస్తారు. ఈ ఆలయం క్రీ.శ.1172కి ముందే ఉనికిలోకి వచ్చింది. ఈ ఆలయ నిర్వహణ మరియు అభివృద్ధికి నర్సరావుపేట, అమరావతి, చిలకూరిపేట మరియు అనేక మంది జమీందార్లు సమిష్టిగా పెద్ద ఎకరాల భూములను విరాళంగా ఇచ్చారని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అన్ని దిశల నుండి మూడు శిఖరాలు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి దీనిని త్రికూట కొండలు అని కూడా పిలుస్తారు. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ శిఖరం, రుద్ర శిఖరం మరియు విష్ణు శిఖరం అని పిలుస్తారు.

దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియో గంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుం డగా, సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞాన దీక్ష పొందారు.
అందు వల్లే ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మ చారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజ స్తంభం కూడా ఉండదు.

త్రికూటాచల మహాత్మ్యం:

ఎల్లమంద గ్రామానికి చెందిన ఎల్లముని మందలింగ బలిజ కులానికి చెందిన మహాభక్తుడు. అడివికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మి జీవించేవాడు. ఒక రోజు మధ్యమ లింగాన్ని పూజించి, మర్నాడు తమ్ములతో విష్ణు శిఖరాన్ని చేరగా కుండపోతగా గాలి, వర్షం కురిసింది. దగ్గరలోని గుహలో తలదాచుకొన్నారు. అక్కడ ఒక ధనం ఉన్న బిందె కనిపించింది. దాన్ని తీసుకొని సాలంకయ్య, రుద్ర శిఖరంలో ప్రత్యక్షమైన ఒక జంగమయ్యను రోజూ పూజించేవాడు. కొద్ది కాలం తర్వాత జంగమయ్య అదృశ్యమైనాడు. సాలంకయ్య వేదన చెంది వెతికి వేసారి నిరాహార దీక్ష చేస్తూ, బ్రహ్మ శిఖరం చేరి ఆక్కడున్న గొల్లభాముకు తన బాధను చెప్తామని వెతికితే ఆమెకూడా కనిపించలేదు. బ్రహ్మ శిఖరంలో ఒక గుహను చేరగానే ‘’నేను నీవిందు ఆరగించాను, నీ వాడిని, పరమేశ్వరుడిని, గొల్లభాము మోక్షమిచ్చాను నేనిక్కడే ఉంటాను. ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు. త్రికూటేశ్వర లింగరూపంలో అర్చించు. మహా శివరాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి నన్ను అభిషేకించాలి. జాగరణ చేసి ప్రభలను కట్టి వీరంగం మొదలైన వాయిద్యాలతో మర్నాడు అన్నదానం చేయాలి. అప్పుడు నువ్వు శివైక్క్యం చెందుతావు’’ అని చెప్పి జంగమ దేవర అదృశ్యమైనాడు.

సాలంకుడు యోగి ఆదేశం తో గుడి కట్టించి త్రికూటేశ్వర లింగాన్ని ప్రతిష్టించి, గొల్లభామకు(ఆనంద వల్లి ) వేరుగా గుడి కట్టించి భక్తితో పూజించాడు. పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించాడు. అప్పుడు దివ్యవాణి ‘’ఇది బ్రహ్మచారి దక్షిణామూర్తి క్షేత్రం. ఇక్కడ కళ్యాణాలు నిషిద్ధం‘’ అని వినిపించింది. సాలంకుడు ప్రతిష్ట కోసం తయారు చేయించిన పార్వతీ విగ్రహం మాయమైంది. విరక్తి చెందిన సాలముడు దేహ త్యాగం చేయ నిశ్చయించి యోగబలంతో లింగైక్యం చెందాడు. అతని తమ్ములు కూడా లింగైక్యం చెందారు. వీరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగాలుగా, సాలంకయ్య ‘’సాలంకేశ్వరుడు‘’గా ఆయన ప్రతిష్టించిన లింగం ‘’కోటేశ్వర లింగం‘’గా బ్రహ్మ శిఖరాన వెలిసి ఈ క్షేత్రం ‘’పంచ బ్రహ్మ స్థానక్షేత్రం‘’గా పేరుపొందింది.

ఆనంద వల్లి (గొల్లభామ):

శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే త్రికూటాచల దక్షిణాన ‘’కొండ కావూరు‘’ గ్రామంలో యాదవ వంశంలో సుందరి సునందలకు గారాలబిడ్డగా ‘’ఆనంద వల్లి‘’ అనే పాప జన్మించింది. చిన్న నాటి నుంచే శివభక్తిలో లీనమయ్యేది. రుద్రాక్షమాలలు ధరించేది. ఆధ్యాత్మిక భావాలను బోధించేది. పెరిగే కొద్దీ శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. . ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది.

ఒక శివరాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్ర శిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి, బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా, సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది.
ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై ఆనందవల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం ఆమె భక్తీ కి సంతసించి జంగమయ్య శివైక్యాన్ని ప్రసాదించాడు.

brahma, dakshina murthy, Kotappa Konda, siva, trikota parvatam, vishnu
భీష్మ ఏకాదశి – భీష్మ తర్పణ విధానం
అరుణాచలం గిరి ప్రదక్షిణ – 2024 పౌర్ణమి తేదీ మరియు సమయాలు

Related Posts