చాతుర్మాస్యం అంటే ఏమిటి?
ఆషాడశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. స్థితికారుడైన విష్ణువు ఆషాడశుద్ధ ఏకాదశి నాడు శేషశయ్య పై నిద్రకు ఉపక్రమిస్తాడు. అందువల్ల దీన్ని శయన ఏకాదశిగా అని కూడా అంటారు. ఆనాటి నుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడు. దీన్ని ఉత్తాన ఏకాదశిగా పిలుస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.
ఈ సంవత్సరం చాతుర్మాస్యం, జులై 22వ తేదీన తొలి ఏకాదశి నాడు ప్రారంభమై నవంబర్ 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ చాతుర్మాస్యం లో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. కొందరు రెండు నెలలకు మాత్రమే పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష బేధం కానీ జాతి బేధం కానీ లేదు. అమ్మవారికి నిత్య పూజలు చేయాలి. కార్తీకమాసంలో చండీ హోమంతో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ చాతుర్మాస్య దీక్షను ప్రస్తుత కాలంలో స్వామీజీలు పీఠాధిపతులు మాత్రమే నిష్టతో చేస్తుంటారు. సాధారణ భక్తులు ఈ దీక్షను ఆచరించేందుకు వెనకాడుతారు ఎందుకంటే ఆ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.
చాతుర్మాస్యం దీక్ష నిబంధనలు
- ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. అంటే ఊరి పొలిమేరలు దాటి కూడా దాటకూడదు.
- ఈ కాలంలో అరుణోదయ వేల స్నానం చేయడం అవసరం.
- వ్రత కాలంలో బ్రహ్మచర్యం, నేలపై నిద్రించడం, అహింసా పాటించాలి.
- ఇష్ట దేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి .
భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు కంఠస్థం చేయాలి. - యోగత సాధన చేయడం శ్రేయస్కరం.
- దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేయాలి
- ముఖ్యంగా కామోద్దీపక కారకాలను సంపూర్ణంగా త్యజించాలి . స్త్రీలకు దూరంగా ఉండాలి.
బ్రహ్మచార్యులు, గృహస్తులు, వృద్ధులు, సన్యాసులు ప్రతి ఒక్కరు కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు. కులవర్గ నియమాలు కానీ లేవంగా వివక్ష గాని లేదు.
చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలో అంటే శ్రావణమాసంలో ఆకు కూరలు, రెండవ నెలలో అంటే భాద్రపద మాసం లో పెరుగు, మూడో నెలలో అంటే ఆశ్వియుజ మాసంలో పాలు, నాలుగో మాసంలో అంటే కార్తీకమాసంలో పప్పు దినుసులు తినకూడదు. కారణాలు ఏమిటంటే ఋతువులు మారుతున్న సమయంలో వ్యాధులు ప్రబలుతాయి వర్షాలతో నదులతో నీరు బురద మయంగా ఉంటుంది. ఆ నీరు వలన రోగాలు, తిండివల్ల అజీర్ణం, మరికొన్ని వ్యాధులు రాకుండా నియంత్రించడానికి నియమిత ఆహారం ఉపవాసాలు ఈ నాలుగు మాసాలు చేయాలి. వీటినే చాతుర్మాస్య నియమంగా ఆరోగ్యరీత్యా చెప్పడం జరిగింది.
ప్రజలంతా ఆరోగ్యమంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబం వ్యవస్థ కోసం మనుగడ సాధించాలని సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సాంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి